ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనేటర్ పౌలిన్ హాన్సన్ బురఖా ధరించి సభలోకి అడుగుపెట్టడం తీవ్ర కలకలానికి దారితీసింది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధించాలని ఆమె దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్‌కు రాజకీయ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఆమె మరోసారి బురఖా ధరించి పార్లమెంటుకు వచ్చారు. ఇంతకుముందు 2017లో కూడా ఆమె ఇదే విధంగా సభకు వచ్చారు.
సెనేటర్ హాన్సన్ బురఖా ధరించి సభలోకి రావడంతో ఇతర సభ్యులు, ముఖ్యంగా ముస్లిం సెనేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇది జాత్యహంకార చర్య అని విమర్శించారు. సభలో హాన్సన్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేయడంతో గందరగోళం చెలరేగి కార్యకలాపాలు నిలిచిపోయాయి. హాన్సన్ సభలో ఉండేందుకు అర్హుత కోల్పోయారని, ఆమెను సస్పెండ్ చేయాలని సెంటర్ లెఫ్ట్ లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
బురఖాను నిషేధించకపోతే తమ జాతీయ భద్రత ప్రమాదంలో పడే ముప్పు ఉందని హాన్సన్ డిమాండ్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, ముఖాలను పూర్తిగా కప్పి ఉంచే వాటిని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి నిరాకరించిన కొద్దిసేపటికే ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. వన్ నేషన్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హాన్సన్.. ఆసియా నుండి వలస వచ్చే వారి పట్ల కూడా వ్యతిరేకత కనబరుస్తున్నారు.









