దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగించి చివరకు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడం వంటి కారణాల వల్ల సూచీలు పడిపోయాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 331 పాయింట్లు కోల్పోయి 84,900.71 వద్ద స్థిరపడింది.
ప్రధాన సూచీలలో నిఫ్టీ 108 పాయింట్లు క్షీణించి, కీలకమైన 26,000 మార్క్ కిందకు వచ్చి 25,959.5 వద్ద ముగిసింది. నిఫ్టీ 26,000 కింద ముగియడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తిరిగి మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడాలంటే నిఫ్టీ 26,150 స్థాయిని దాటాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ రియల్టీ సూచీ 2.05 శాతం పతనంతో రియల్ ఎస్టేట్ షేర్లు భారీ ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, కెమికల్ రంగాలు కూడా నష్టపోయాయి. అయితే, మార్కెట్ ట్రెండ్‌కు విరుద్ధంగా ఐటీ రంగం 0.41 శాతం లాభపడింది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎం&ఎం వంటి షేర్లు ప్రధానంగా నష్టపోగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. మరోవైపు, శుక్రవారం చారిత్రక కనిష్ఠానికి చేరుకున్న రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 35 పైసలు బలపడి 89.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.









