ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన, సంక్షేమ పథకాలు, పౌర సేవలను మరింత పారదర్శకంగా అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి, వారి సమగ్ర సమాచారంతో కూడిన **‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్’**ను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం’ (FBMS) అమలు ద్వారా కుటుంబ సాధికారిత సాధించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకే కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ సులభతరం అవుతుందని తెలిపారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి సాంకేతిక వెన్నెముకగా రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ఆధ్వర్యంలోని డేటా లేక్‌ను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్డులో ఆధార్, FBMS ఐడీ, వ్యాక్సినేషన్ వివరాలు, పౌష్టికాహార స్థితి, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్ల వరకు దాదాపు 25 రకాల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు. ఈ వ్యవస్థను కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాలకు పరిమితం చేయకుండా, పౌరుల జీవితంలోని ప్రతి దశలో ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా స్టాటిక్, డైనమిక్ డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి, జూన్ నాటికి కార్డుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లను ఈ వ్యవస్థ ద్వారా అధిగమించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.









