AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంత పార్టీలోని ‘కామ పిశాచుల’ను అదుపు చేయడంలో స్టాలిన్ విఫలం”: పళనిస్వామి తీవ్ర ఆగ్రహం!

తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత పార్టీలోని ‘లైంగిక నేరగాళ్లను’ నియంత్రించడంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన శనివారం ఒక ప్రకటనలో తీవ్ర ఆరోపణలు చేశారు. విల్లుపురానికి చెందిన డీఎంకే యూనియన్ కార్యదర్శి ఒకరు గత ఆరు నెలలుగా ఒక మహిళను లైంగికంగా వేధించారనే వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పళనిస్వామి పేర్కొన్నారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడు తన పార్టీ పలుకుబడిని అడ్డం పెట్టుకుని, “నన్ను పోలీసులేమీ చేయలేరు, ఇక్కడ నేనే పెద్ద మనిషిని” అని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పళనిస్వామి తెలిపారు. ఈ ఘటన డీఎంకే పాలనలో నెలకొన్న భయానక వాతావరణానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సీఎం స్టాలిన్‌ను సూటిగా ప్రశ్నిస్తూ, “మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి, ఇప్పుడు డీఎంకే నేతల నుంచే వారికి రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందా?” అని పళనిస్వామి నిలదీశారు.

తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి పదేపదే విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. “సొంత పార్టీ కార్యకర్తలనే క్రమశిక్షణలో పెట్టలేని ముఖ్యమంత్రి, మొత్తం తమిళనాడు ప్రజలను ఎలా కాపాడగలరు?” అని ఆయన ప్రశ్నించారు. విల్లుపురం ఘటన అత్యంత హేయమైనదని పేర్కొంటూ, రాజకీయ జోక్యం లేకుండా నిందితుడిపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ANN TOP 10