నిన్నమొన్నటి వరకు బద్ధ శత్రువులుగా విమర్శల దాడి చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేపింది. గతంలో ట్రంప్, మమ్దానీని “రాడికల్ లెఫ్ట్ లూనాటిక్” అని విమర్శించగా, మమ్దానీ ట్రంప్‌ను “నియంత” అంటూ తిట్టిపారేశారు. అయితే, శుక్రవారం జరిగిన ఈ భేటీ అనంతరం వారిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ, “న్యూయార్క్ మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన నగరం. ఆ నగరం, ప్రజలు బాగుండాలనేది మా కామన్ లక్ష్యం” అని స్పష్టం చేశారు. మమ్దానీకి అభినందనలు తెలిపిన ట్రంప్, రాజకీయ రేఖలు పక్కనబెట్టి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్, ఆహార ధరలు (నూనె ధరలు భారీగా తగ్గుతున్నాయని) వంటి కీలక సమస్యలపై ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చామని ట్రంప్ తెలిపారు.
మమ్దానీ కూడా ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని అన్నారు. న్యూయార్క్‌లో రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం (అద్దెలు, కూరగాయల ధరలు, యుటిలిటీ బిల్లులు) సాధారణ కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వీటిని ఎలా తగ్గించాలనే అంశాలపై ట్రంప్‌తో చర్చించినట్లు తెలిపారు. అయితే, ప్రెస్మీట్లో విలేకరి మమ్దానీని గతంలో ట్రంప్‌ను నియంత అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించగా, ట్రంప్ నవ్వుతూ జోక్ చేసి, మమ్దానీ భుజంపై కొడుతూ “అవును అను.. ఓ పనైపోతుంది.. నేనేమనుకోను” అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.









