భారతదేశంలోని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారి,భద్రతా దళాలకు ఎప్పుడూ పట్టుబడని నాయకుడిగా, మావోయిస్టు (నక్సలైట్) ఉద్యమంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా పేరొందిన మడ్వి హిడ్మా చరిత్ర 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించడంతో ముగిసిపోయింది.ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల “బస్తర్ దెయ్యం”గా పిలుచుకున్న హిడ్మా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) సెంట్రల్ కమిటీలో అతి పిన్నవయస్కుడైన సభ్యుడుగా మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్ జిఏ) బెటాలియన్ నంబర్ 1 కమాండర్ గా ఎదిగిన ఆయనపై రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బహుమతి ప్రకటించారు.
మడ్వి హిడ్మా ప్రస్థానం
1981లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో మురియా గోండ్ ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు.
5వ తరగతి(నిర్దిష్టంగా తెలియదు)వరకు మాత్రమే చదివాడు.1991లో కేవలం 10-12 ఏళ్ల వయసులో బాల సంఘం(మావోయిస్టుల చైల్డ్ క్యాడర్) సభ్యుడిగా చేరాడు.సీనియర్ నాయకులు రమణ్ణ మరియు బద్రన్న (రమేష్ పుడియామి) ఆయనను రిక్రూట్ చేశారు. ఉద్యమంలోకి ప్రవేశించాక
హిడ్మాకు సంతోష్,దేవా,దేవ్, అనిల్ వంటి మారుపేర్లతో పిలిచేవారు.బాల్యం నుండి హిడ్మా పూర్తిగా మావోయిస్టు ఉద్యమంలోనే పెరిగాడు. ఆదివాసీల అణచివేత, అడవుల హక్కులు వంటి సమస్యలు ఆయనను ఉద్యమం వైపు ఆకర్షించాయి.
మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ
మావోయిస్టు ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ 1990 ల చివరలో సంఘం సభ్యుడిగా తర్వాత ప్లటూన్ కమాండర్‌గా పదోన్నతి పొందాడు.2000ల ప్రారంభంలో పిఎల్ జిఏలో చేరి,దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక సభ్యుడయ్యాడు.పిఎల్ జిఏ బెటాలియన్ నంబర్ 1 కమాండర్‌గా నియమితుడయ్యాడు.ఇది మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన మరియు మొబైల్ యూనిట్.చిన్న వయసులోనే సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు. బస్తర్ నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ఏకైక ఆదివాసీ నాయకుడుగా హిడ్మా ఉద్యమంలో పట్టు సాధించాడు.ఉద్యమంలో మావోయిస్టు మొబైల్ పొలిటికల్ స్కూల్ హెడ్ మడకం రాజే (రాజక్క)ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో భర్తతో పాటు మరణించింది.హిడ్మా గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నిపుణుడు.అడవుల భూభాగాన్ని బాగా తెలుసుకుని,ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో ఎప్పుడూ ముందుండేవాడు.మావోయిస్టు ఉద్యమంలో జరిగిన ప్రధాన దాడుల్లో హిడ్మా ప్రమేయం ఉన్నట్లు,హిడ్మాపై 26 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయని భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
*హిడ్మా సారధ్యంలో ఘోరమైన దాడులు
హిడ్మా సారధ్యంలో జరిగిన 26 కంటే ఎక్కువ దాడుల్లో 250 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించారు. 2010 ఏప్రిల్ లో దంతెవాడ (చింతల్‌నార్ లేదా తడ్మెట్లా) దాడిలో 76 సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద దాడి.2013 మేలో ఝీరం ఘాటీ (దర్భా వ్యాలీ) దాడిలో కాంగ్రెస్ నాయకులు మహేంద్ర కర్మ,నందకుమార్ పటేల్ సహా 27 మంది మరణించారు.2017లో జరిగిన సుక్మా దాడుల్లో 37 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.2021 ఏప్రిల్ లో సుక్మా-బీజాపూర్ (తర్రెం) దాడిలో 22 జవాన్లు మరణించారు.ఇలాంటి ఉద్యమ దాడులకు వ్యూహకర్తగా,ఫీల్డ్ కమాండర్‌గా హిడ్మా పాత్ర కీలకంగా ఉండేది.
చిక్కడు దొరకడు బక్కపలుచని హిడ్మా
మావోయిస్టు ఉద్యమంలో దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో దిట్ట. కనీసం ఆయన ఫోటో కూడా సరిగా లేదు.2025లోనే ఒక క్లియర్ ఫోటో వచ్చింది, మరణం కూడా 2025 లోనే జరిగింది.2016లో అరెస్టు అయినా తక్కువ స్థాయి సభ్యుడిగా చూపి విడుదల చేశారు.ఇక అప్పటి నుండి (2021-2025) జరిగిన భారీ ఆపరేషన్‌ల నుంచే గాక, కర్రెగుట్ట హిల్స్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయినా హిడ్మా మాత్రం తప్పించుకున్నాడు.కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కగార్ ఆపరేషన్ మూలంగా మావోయిస్టు ఉద్యమంలో చీలిక ఏర్పడి అనేకమంది ముఖ్య నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయిన విషయం తెలిసిందే.కానీ, హిడ్మా మాత్రం తన పోరాట పంథాను కొనసాగించాడు. చివరికి 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ మరియు స్థానిక పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో హిడ్మా,ఆయన భార్య రాజే సహా 6 మంది మావోయిస్టులు మరణించారు.ఇది మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31లోపు మావోయిజాన్ని అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హిడ్మా మరణం ఉద్యమ ప్రస్థానంలో ఒక మైలురాయి చూడాలి. మావోయిస్టు విప్లవోద్యమంలో హిడ్మా జీవితం ఆదివాసీల ఆవేదనగా,రాజ్య హింస మరియు గెరిల్లా యుద్ధం మధ్య సంఘర్షణగా ప్రతిబింబిస్తుంది.ఆయన మరణంతో బస్తర్‌లో మావోయిస్టు ఉద్యమం బలహీనపడినట్లు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ప్రమాదకరమైన టార్గెట్‌గా హిడ్మా మారడానికి ముఖ్య కారణాలు
ఒక సాధారణ ఆదివాసి బిడ్డ మడ్వి హిడ్మా దేశ పాలకులకు అత్యంత ప్రమాదకరమైన టార్గెట్‌గా మారడానికి అనేక కారణాలు
కనిపిస్తాయి.ఆదివాసీలపై దీర్ఘకాల అన్యాయమే మావోయిస్టు ఉద్యమానికి మూలమని చెప్పాలి.బస్తర్ (ఛత్తీస్‌గఢ్) ప్రాంతంలో ఆదివాసీల భూములను కార్పొరేట్ మైనింగ్ కోసం లాగేసుకుపోయారు.దీనిని అడ్డుకున్న ఆదివాసీలను అణచివేసేందుకు ప్రభుత్వం సాల్వా జుడుం అనే ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి వారికి తుపాకులు ఇచ్చి, 2005 నుండి 09 వరకు వేలాది మంది ఆదివాసీలను ఇళ్ల నుంచి బలవంతంగా తరలించి క్యాంపుల్లో బంధించారు.పోలీసులు, సాల్వా జుడుం గూండాలు
ఆదివాసీ యువతను హత్యలు చేస్తూ సాధించిన మారణకాండ,ఆదివాసీ మహిళలను అత్యాచారాలు చేస్తూ ఈ మొత్తం అరాచక పర్వాన్ని మావోయిస్టులపై నెట్టాయి. హిడ్మా కేవలం 10-12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే (1991లో) ఈ అన్యాయాలను చూసి బాల సంఘంలో చేరాడు.ఆ కసి పట్టుదలతో అత్యంత నిపుణుడైన గెరిల్లా కమాండర్‌గా ఎదిగాడు. అడవుల భూభాగాన్ని గుడ్డిగా తెలిసిన వ్యక్తిగా ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ను అద్భుతంగా అమలు చేశాడు.దశాబ్దకాలంగా వేలాది మంది జవాన్లు, డ్రోన్లు,హెలికాప్టర్లతో వెతికినా పట్టుబడలేదు.ఎన్నోసార్లు “హిడ్మా చనిపోయాడు” అని ప్రకటించి తర్వాత ఆ పేరు వేరే వాడిదని తేలిందని సవరించుకున్నారు.ఇది భద్రతా బలగాలకు అవమానంగా మారింది.ఇదే హిడ్మా మావోయిస్టు ఉద్యమానికి చిహ్నంగా మారడానికి కారణమైంది. ఒక సాధారణ ఆదివాసీ బిడ్డ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాడన్నది పాలకులకు రాజకీయంగా ఇబ్బందికరంగా,అవమానకరంగా మారింది.అందుకే ఆయన్ని అంతం చేయడం ద్వారా “మావోయిజం అంతమైంది” అని ప్రచారం చేయాలని కేంద్రం కోరుకుంది.అందులో భాగంగానే 2026 మార్చి 31లోపు మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం,దానికి అనుకూలంగా “కగారు ఆపరేషన్” పేరుతో జరిగే భద్రత బలగాల కూంబింగ్ లో హిడ్మా అతి ముఖ్యమైన టార్గెట్ గా మారాడు.ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్ర హింసకు బదులుగా తుపాకి ఎత్తడం,దాన్ని అత్యంత నైపుణ్యంతో నిర్వహించడం, ఎప్పుడూ పట్టుబడకుండా ఉండడం ఇవన్నీ కలిసి హిడ్మాను దేశ పాలకులకు “నంబర్ వన్ ఎనిమీ”గా మార్చాయి. ఆయన కథ ఆదివాసీల ఆవేదన, రాష్ట్ర దమనకాండ,గెరిల్లా పోరాటం మధ్య సంఘర్షణను సూచిస్తుంది.
✍గంట సోమన్న,సీనియర్ జర్నలిస్ట్.







