AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్ ఆమోదం: రష్యా-ఉక్రెయిన్ శాంతి కోసం 28 పాయింట్ల ప్రణాళిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రూపొందించిన 28-పాయింట్ల శాంతి ప్రణాళికకు ఈ వారం ‘నిశ్శబ్దంగా’ ఆమోదం తెలిపినట్లు సమాచారం. NBC న్యూస్ ఒక సీనియర్ అధికారి సమాచారం ఆధారంగా ఈ వార్తను వెల్లడించింది. గత కొన్ని వారాలుగా అమెరికా ఉన్నతాధికారులు రహస్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారని, ఈ ప్రక్రియలో రష్యా రాయబారి కిరిల్ దిమిత్రీవ్తో పాటు ఉక్రెయిన్ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ గోప్యంగా సిద్ధమైన శాంతి ప్రణాళిక పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ప్రతిపాదన ట్రంప్ గతంలో ప్రవేశపెట్టిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను ఆధారంగా చేసుకున్నట్లుగా Axios పత్రిక తెలిపింది. NBC న్యూస్ పేర్కొన్న అధికారి వివరాల ప్రకారం, కీలక పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నందున ప్రణాళిక పూర్తి వివరాలు ఇంకా గోప్యంగా ఉంచబడ్డాయి. అయితే, ఈ శాంతి ప్రణాళిక ఇంకా అధికారికంగా ఉక్రెయిన్ నేతలకు సమర్పించలేదు.

ఈ ప్రణాళిక తయారీ సమయంలోనే అమెరికన్ ఆర్మీ ప్రతినిధుల బృందం ఉక్రెయిన్‌ను సందర్శించడం జరిగింది. ఈ పర్యటన లక్ష్యాలలో ఉక్రెయిన్‌తో రక్షణ వ్యూహాలు, సాంకేతికతపై చర్చించడంతో పాటు, నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి వేగవంతం చేయడం కూడా ఉందని ఇద్దరు అమెరికా అధికారులు మరియు ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమీప వర్గాలు వెల్లడించాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి తర్వాత మొదలైన ఈ యుద్ధం, వేలాది ప్రాణాలు కోల్పోయేలా చేసి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది.

ANN TOP 10