కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు (Change in Chief Minister) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఈ రోజు మరియు రేపు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న పవర్ షేరింగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఢిల్లీకి వెళ్లిన డీకే వర్గం ఎమ్మెల్యేలు, ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి మార్పును అమలు చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నారు. ఇందులో భాగంగా, వారు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్‌ను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అలాగే, రేపు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ను కూడా కలుస్తారని సమాచారం. ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలలో దినేశ్ గూళిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసు ఉండగా, మరికొందరు ఎమ్మెల్యేలు రేపు ఉదయం చేరుకోనున్నారు.
ఈ పరిణామంపై డీకే శివకుమార్ సోదరుడు సురేశ్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “నేను ఢిల్లీకి వెళ్లి బంగారం, వజ్రాలు ఏమైనా అడుగుతానా ఏమిటి? మా నాయకుడు డీకే శివకుమార్ కోసమే దేశ రాజధానికి వెళుతున్నాను” అని అన్నారు. అయినప్పటికీ, సీఎం సిద్ధరామయ్య మరియు శివకుమార్ ఇద్దరూ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.







