ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్స్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు మారడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ డీల్‌లో భాగంగా, సంజూ శాంసన్‌ను CSK రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ప్రతిగా, CSK స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు మారగా, ఆ జట్టు జడేజాను రూ. 14 కోట్లకు, సామ్ కర్రన్‌ను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
రాజస్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ అనుబంధం తర్వాత జట్టును వీడిన నేపథ్యంలో, సంజూ శాంసన్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నాడు. తన పోస్ట్‌లో, “మనం ఇక్కడ కొన్నాళ్ల పాటే ఉంటాం. ఫ్రాంచైజీ కోసం నా సర్వస్వం దారపోశాను. క్రికెట్‌ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను” అని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీలోని ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుడిగానే భావించినట్లు తెలిపిన సంజూ, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టే జట్టును వీడుతున్నానని, తనకు లభించిన దానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ ఐపీఎల్ కెరీర్ రాజస్థాన్ రాయల్స్‌తోనే ఎక్కువగా ముడిపడి ఉంది. అతను 2013లో రాయల్స్‌లో చేరి, 2016-17లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. ఆ తర్వాత 2018లో తిరిగి రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చి, 2025 వరకు కొనసాగాడు. కెప్టెన్‌గా రాజస్థాన్‌ను ముందుండి నడిపించి, 2022 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ తాజా ట్రేడ్ డీల్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌లో సంజూ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.







