AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరేళ్ల విరామం తర్వాత నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి బెయిల్‌పై ఉన్న జగన్, దాదాపు ఆరేళ్లుగా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావడం లేదు. అయితే, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోరగా, ఈ నెల 21వ తేదీలోగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఒక రోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు.

కోర్టు ఆదేశాల మేరకు వైయస్ జగన్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు కాబోతుండటంతో, పోలీసులు ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు పరిసరాల్లో వైసీపీ శ్రేణులు ఎక్కడా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించిన జగన్, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, గత 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.

దాదాపు 12 సంవత్సరాలపాటు బెయిల్‌పై బయట ఉన్న జగన్, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. కోర్టులో విచారణ అనంతరం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు.

ANN TOP 10