వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన వంగా గీత ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఆమె పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమెపై పవన్ కల్యాణ్ బరిలో ఉండటం, ఆయన అభిమానులు, సామాజికవర్గం ఓటర్లు పక్కాగా ఓటేయడంతో వంగా గీత దారుణంగా ఓటమిని చవిచూశారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాము అధికారంలోకి వస్తే వంగా గీతకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చినా, అది ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వంగా గీత పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా లేరనేది వాస్తవం.
2019 ఎన్నికల్లో వంగా గీత కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే, ఆమెకు పార్లమెంటు కంటే శాసనసభలోకి ప్రవేశించాలనే మక్కువ ఎక్కువ ఉండటంతోనే జగన్ ఆమెకు పిఠాపురం నియోజకవర్గం కేటాయించారు. కానీ, పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. ఆయన వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. దీంతో, పవన్ కల్యాణ్‌పై పోటీ చేసి గెలుపొందడం కష్టమేనని భావిస్తున్న వంగా గీత, తనకు వేరే నియోజకవర్గాన్ని అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనపడుతుంది.
పిఠాపురంలో మళ్లీ పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తే గెలుపు అనేది చాలా వరకూ కష్టమే కావడంతో, ఆమె మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పటి వరకూ జగన్ నుంచి క్లారిటీ రాకపోవడంతోనే వంగా గీత యాక్టివ్‌గా లేరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశానా? అన్న అంతర్మథనంలో వంగా గీత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురంలోనూ ఆమె పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు.








