తిరుమల శ్రీవారి భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా, ఆ పది రోజుల పాటు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ హోమాన్ని తిరుపతిలోని అలిపిరి వద్ద టీటీడీ నిర్వహిస్తోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా రద్దు చేయబడిన ఈ హోమం టికెట్ల విషయంలో భక్తులు ఈ విషయాన్ని గమనించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఆర్జిత సేవలను కూడా రద్దు చేసిన టీటీడీ, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలన్నీ ఆ పది రోజులు సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడం కోసమే ఉద్దేశించబడ్డాయి








