AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముందస్తు కసరత్తు: ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక చర్యలు చేపట్టింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు కారణంగా గతంలో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసినప్పటికీ, ఇప్పుడు మరోసారి ఎన్నికల నిర్వహణకు కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు ఎస్‌ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, రేపట్నుంచే (నవంబర్ 20వ తేదీ) మొదలుకొని ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణ చేయాలని నిర్ణయించింది.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రకారం, నవంబర్ 20వ తేదీన కొత్త ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం, నవంబర్ 21వ తేదీన స్వీకరించిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి, అందులో ఉన్న తప్పులను సవరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నవంబర్ 23వ తేదీన తుది ఓటర్ల జాబితాతోపాటు ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా పంచాయతీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల చిక్కుముడిని విప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా, పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు రెండో వారంలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరులోపు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మార్చి 31వ తేదీ లోపు ఎన్నికలను పూర్తి చేస్తేనే, కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై వేగంగా దృష్టి సారించింది.

ANN TOP 10