AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రీ స్కూల్ పిల్లలకు 200 రోజులు ఉచిత పాల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో భాగంగా, రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రీ స్కూల్ పిల్లలకు (3-6 సంవత్సరాల వయస్సు వారికి) అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఏడాదిలో సుమారు 200 రోజుల పాటు ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇది విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.

ఈ పథకంలో భాగంగా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశాల మేరకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారికి రోజూ 100 మిల్లీలీటర్ల ‘విజయా డెయిరీ డబుల్ టోన్డ్ యూహెచ్‌టీ టెట్రా’ పాల ప్యాకెట్లను అందించనున్నారు. ఈ పాలను వేడి చేసి, పంచదార లేదా బెల్లం కలిపి గోరు వెచ్చగా పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం అమలుపై క్షేత్రస్థాయి ఉద్యోగులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

మంత్రి సీతక్క సోమవారం ములుగులోని కృష్ణ కాలనీ ప్రీ-స్కూల్ పిల్లలకు పాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. పిల్లలను సొంత వారిలా చూసుకోవాలని ఆమె అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు.

ANN TOP 10