ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోకి రాబోతున్న మరో భారీ పెట్టుబడి గురించి ట్వీట్ చేసి పారిశ్రామిక వర్గాల్లో, నెటిజన్లలో తీవ్ర ఉత్కంఠ రేపారు. “కార్పొరేట్ బోర్డు రూముల్లో కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై భారీగా పందెం కాసేందుకు ఒక గ్లోబల్ ఫండ్ సిద్ధమవుతోంది” అంటూ ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ భారీ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడుల పూర్తి వివరాలను శుక్రవారం ఉదయం 9 గంటలకు వెల్లడిస్తామని ప్రకటిస్తూ, “ఎవరో ఊహించగలరా?” అంటూ సస్పెన్స్‌కు తెరలేపారు.
నిన్న కూడా ఇలాంటి ట్వీటే చేసిన నారా లోకేశ్, ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ, గతంలో రాష్ట్రానికి దూరమైన ‘రెన్యూ’ పవర్ సంస్థ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని, భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రకటించారు. ఇవాళ చేసిన ఈ తాజా ట్వీట్‌తో మరోసారి ఏపీకి రాబోయే ఆ భారీ పెట్టుబడి ఏ రంగంలో ఉండబోతోంది, ఏ సంస్థ పెట్టుబడి పెట్టనుంది అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి ‘గ్లోబల్ ఫండ్’ అని ప్రస్తావించడంతో, ఇది భారీ ఎత్తున నిధులు సమీకరించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు సాధారణంగా వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయి కాబట్టి, ఈ ప్రకటనపై ప్రాధాన్యత పెరిగింది. లోకేశ్ ట్వీట్‌కు #ChooseSpeedChooseAP (వేగాన్ని ఎంచుకోండి.. ఏపీని ఎంచుకోండి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం ద్వారా, తమ ప్రభుత్వ వేగవంతమైన విధానాలను పరోక్షంగా సూచించారు. మొత్తం మీద, ఆ గ్లోబల్ ఫండ్ ఏదో తెలుసుకోవాలంటే శుక్రవారం ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సిందే.








