భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం, ఎందుకంటే ఇందులో గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో, ఈ సిరీస్‌ను గెలవడం భారత్‌కు మరింత ముఖ్యంగా మారింది. సొంత గడ్డపై ఆడుతుండటం కొంత కలసి వచ్చే అంశమని చెప్పవచ్చు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి.
భారత జట్టు ప్రస్తుతం పటిష్టంగానే ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలోని తప్పొప్పులను సరిదిద్దుకుని ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌తో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తుండటం ఉత్కంఠకు దారితీసింది. గాయం నుంచి కోలుకున్న పంత్ రాకతో తుది జట్టులో ఎవరిని తొలగిస్తారనే చర్చ మొదలైంది. మరొక వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో అతన్ని తొలగించడం కష్టమనిపిస్తోంది.
రిషబ్ పంత్ స్థానంలో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా ఆస్ట్రేలియా పర్యటనలో పెద్దగా రాణించని సాయి సుదర్శన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద భారత జట్టు స్వల్ప మార్పులతోనే రేపు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. WTC ఫైనల్ రేసులో నిలబడాలంటే ఈ సిరీస్‌లో అమితుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.








