AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ మహ్మద్ ఉగ్రవాదిగా మారడానికి కారణమేమిటి?

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఈ విధ్వంసం వెనుక ఉండటం సంచలనంగా మారింది. ఈ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ మహ్మద్ కూడా డాక్టరేనని, అతను పుల్వామాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 1989లో జన్మించిన ఉమర్ మహ్మద్, శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశాడు. జీఎంసీ అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసి, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఉమర్ మహ్మద్ నేపథ్యం చూస్తే, అతని తండ్రి నబీ భట్ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదేళ్ల క్రితం ఉద్యోగం మానేశారు. ఉన్నత విద్యను అభ్యసించి, వైద్యుడిగా మంచి స్థానంలో ఉన్న ఉమర్ మహ్మద్, తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనేక మంది డాక్టర్లను ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో పట్టుకోవడంతో, తాను కూడా దొరికిపోతానని ఉమర్ మహ్మద్ భయపడ్డాడు.

ఈ భయంతోనే, చనిపోయే ముందు భారీ పేలుళ్లకు పాల్పడాలని భావించి ఉమర్ మహ్మద్ ఈ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ పేలుళ్లు జరపడానికి ముందు అతను తన తల్లితో మాట్లాడినట్లు, తాను లైబ్రరీలో చదువుకుంటున్నానని ఫోన్లు చేయవద్దని కోరినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఉమర్ మహ్మద్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడులో మరణించింది ఉమర్ మహ్మద్ కాదా అని నిర్ధారించుకోవడానికి, వారి నుంచి డీఎన్‌ఏ టెస్ట్ కోసం రక్త నమూనాలను సేకరించారు.

 

ANN TOP 10