టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా సన్నగా, పీలగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య సమస్యలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా తన బావమరిది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో, ఆ తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ గతంలో కంటే చాలా సన్నబడి, కొంచెం నీరసంగా కనిపించారు. దీంతో నెటిజన్లు మరియు అభిమానులు ‘ఎన్టీఆర్ కు ఏమైంది? హెల్త్ బాలేదా?’ అంటూ రకరకాల కామెంట్లు చేయడం ప్రారంభించారు. అయితే, ఈ వార్తలపై ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ఉన్న సమాచారం మరియు సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట ప్రకారం, ఎన్టీఆర్ సన్నబడటానికి కారణం ఆరోగ్య సమస్యలు కాదట. ఆయన ఆరోగ్యం పర్ఫెక్ట్‌గా ఉందని సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ (తండ్రి, కొడుకు)లో కనిపించనున్నారు.
ఎన్టీఆర్ ఇంతలా సన్నబడటానికి కారణం, ఆయన పోషిస్తున్న కొడుకు పాత్రలో పర్ఫెక్షన్ కోసమేనని తెలిసింది. ఈ కొత్త లుక్‌లోకి మారడం కోసం ఎన్టీఆర్ 2025 ఫిబ్రవరి నుంచే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారట. పాత్రల కోసం తన దేహాన్ని మార్చుకోవడం ఎన్టీఆర్‌కు కొత్తేమీ కాదు. గతంలో ‘యమదొంగ’, ‘అరవింద సమేత’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల కోసం కూడా ఆయన తన లుక్స్‌ని పూర్తిగా మార్చుకున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమా కోసం ఈ కొత్త లుక్‌లోకి మారాడని ఆయన క్లోజ్ సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి.









