పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) వేదికగా పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. పీవోకేలో సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని భారత దౌత్యవేత్త, యూఎన్ మిషన్‌లో తొలి సెక్రటరీ భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు.
“పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని భావికా మంగళానందన్ స్పష్టం చేశారు. పీవోకేలోని కొన్ని ప్రాంతాలలో తమ ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న అనేక మంది అమాయక పౌరులను పాక్ దళాలు చంపేశాయని ఆమె మండిపడ్డారు.
ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ దౌత్యవేత్తలు భారత్‌పై దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని, అయితే పదే పదే చెప్పే అబద్ధాలు సత్యాన్ని మార్చవని ఆమె తేల్చి చెప్పారు. పీవోకేలో జరుగుతున్న దారుణాలను ఆపకుండా భారత్‌పై నిందలు మోపేందుకు పాక్ ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ద్వంద్వ మాటలు, కపటత్వం ఈ గొప్ప వేదికకు అర్హమైనవి కావని భావికా మంగళానందన్ వ్యాఖ్యానించారు.









