AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆసియాలోనే అతిపెద్ద నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు: 16 వేల కుటుంబాల పునరావాసం

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్మితం కాబోతోంది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఫేజ్ 3, 4 విస్తరణకు సంబంధించిన పునరావాస, పునర్నిర్మాణ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం జేవార్‌లోని 14 గ్రామాలకు చెందిన 1857 హెక్టార్లు (4587 ఎకరాలు) భూమిని సేకరిస్తున్నారు. ఈ విస్తరణ కారణంగా ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే కుటుంబాల సంఖ్యను 17,945 నుంచి 15,920కు తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కారణంగా ఇళ్లు, పొలాలు కోల్పోయే నిర్వాసితులకు యూపీ సర్కార్ పూర్తి సహాయం అందిస్తోంది. నిర్వాసితులకు కొత్త నివాస స్థలాలు కేటాయించి, అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాతే వారిని తరలించడం జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాక, భూ యజమానులకు గతంలో ఉన్న రేట్ల కంటే 40 శాతం పెంచి, చదరపు మీటరుకు రూ.4,300 పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పునరావాస కాలనీలను ఏర్పాటు చేయడానికి 438 హెక్టార్లు (1082 ఎకరాలు) పనులు చేపట్టగా, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 2 ఏళ్లు పడుతుందని అంచనా.

ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, ఇది మొత్తం 11,750 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని, ఐదు రన్‌వేలతో ఏటా 30 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం కలిగి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణకు రూ.5 వేల కోట్లు, నిర్మాణానికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మొదటగా ఈ ఎయిర్‌పోర్టు దేశంలోని 10 ప్రధాన నగరాలకు డొమెస్టిక్ విమాన సేవలు అందించనుంది, ఇది ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ కనెక్టివిటీ మరియు ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.

ANN TOP 10