భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుండి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. రఫేల్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ ప్రయాణానికి గ్రూప్ కెప్టెన్ అమిత్ గహానీ సారథ్యం వహించారు. మొత్తం 30 నుండి 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో రాష్ట్రపతి రఫేల్ అత్యాధునిక సామర్థ్యాలను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ చారిత్రక ఘట్టం భారత వైమానిక దళం (IAF) యొక్క గొప్ప చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ చారిత్రక ప్రయాణంతో పాటు, రాష్ట్రపతి ముర్ము రఫేల్ విమానం ముందు ఫోటో దిగిన అధికారి స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ పట్ల పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారానికి గట్టి జవాబుగా నిలిచింది. దేశంలో మొదటి మరియు ఏకైక మహిళా రఫేల్ ఫైటర్ పైలట్ అయిన శివాంగి సింగ్‌ను ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ బంధించిందని లేదా చంపేసిందని పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. సాక్షాత్తు దేశాధినేత శివాంగి సింగ్‌తో కలిసి కనిపించడం ద్వారా ఆ ప్రచారమంతా నిరాధారమైన అబద్ధమని తేలిపోయింది.
భారత వైమానిక దళం (IAF) కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. 159వ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కోర్సు (QFIC) ముగింపు వేడుకల్లో శివాంగి సింగ్‌కు ప్రతిష్టాత్మకమైన “క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (QFI)” బ్యాడ్జ్ లభించిన విషయాన్ని వెల్లడిస్తూ చిత్రాలను విడుదల చేసింది. వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2020లో రఫేల్ పైలట్‌గా ఎంపికై, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. ఆమె వృత్తి నైపుణ్యం, నిర్భయ వైఖరికి గుర్తింపుగా దక్కిన ఈ గౌరవం, పాకిస్తాన్ చేస్తున్న ప్రచార యుద్ధాన్ని తిప్పికొట్టింది.








