మొంథా తీవ్ర తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణపై భారీగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మంగళవారం అర్ధరాత్రి నరసాపురం సమీపంలో తీరం దాటినప్పటికీ, ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కి.మీ., ఖమ్మంకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, బుధవారం రోజున వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున, ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. దీంతో పాటు, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై ఇప్పటికే గట్టిగా ఉంది. దీని కారణంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో ఏకంగా 34.8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మరోవైపు, మార్కెట్ యార్డులకు తరలించిన వరి ధాన్యం భారీ వర్షాలకు తడిసి ముద్దైందని, ఇంకా పొలాల్లో కోయని వరి పంట అలాగే ఉందంటూ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను కొనసాగిస్తోంది.








