మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, గురువారం రోజున కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
మొంథా తుఫాను వెళ్లిపోయినప్పటికీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెరువులు, కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున, వాటిని దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది. మరోవైపు, తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనంతర చర్యలపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.
మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, తుఫాను ప్రభావిత గ్రామాల్లో ‘సూపర్ క్లోరినేషన్’, ‘సూపర్ శానిటేషన్’ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచి, 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. తాగు నీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు ఈ సమీక్షలో తెలియజేశారు.








