మనిషి కిడ్నీకి ప్రత్యామ్నాయంగా జంతువుల అవయవాలను అమర్చే ప్రయోగాలలో (జెనోట్రాన్స్‌ప్లాంట్) కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన 67 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ అనే రోగికి జన్యు మార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చగా, ఆయన రికార్డు స్థాయిలో 271 రోజులు (దాదాపు 9 నెలలు) జీవించారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ప్రయోగంలో, దాదాపు 9 నెలల పాటు ఆండ్రూస్‌లో పంది కిడ్నీ విజయవంతంగా పనిచేసింది. అనంతరం కిడ్నీ పనితీరు క్షీణించడంతో దానిని తొలగించి, ఆండ్రూస్‌కు మళ్లీ డయాలసిస్ చికిత్సను ప్రారంభించారు.
టిమ్ ఆండ్రూస్‌కు డయాబెటిస్ కారణంగా చివరి దశ కిడ్నీ వ్యాధి రావడంతో, రిస్క్ అని తెలిసినప్పటికీ ఆయన జెనోట్రాన్స్‌ప్లాంట్‌కు ఒప్పుకున్నారు. కేవలం డయాలసిస్ నుండి దూరంగా ఉండటమే కాకుండా, తన ప్రయోగం ద్వారా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఇతరులకు సహాయం చేయగలనని ఆయన భావించారు. అమెరికాలో పంది కిడ్నీ అమర్చిన నాల్గవ వ్యక్తి ఆండ్రూస్. గతంలో మూడవ రోగి 130 రోజులు జీవించి రికార్డు సృష్టించగా, ఆండ్రూస్ 271 రోజులు జీవించి ఆ రికార్డును అధిగమించారు.
కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఈ ప్రయోగం ఆశాకిరణంగా నిలుస్తోంది. ఒక్క అమెరికాలోనే సుమారు 90 వేల మంది కిడ్నీ కోసం వేచి చూస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇజెనిసిస్ అనే కంపెనీ పంది కిడ్నీకి 69 జీన్ ఎడిట్స్ చేసి, మనిషి శరీరానికి సరిపోయే విధంగా, రోగనిరోధకతను తట్టుకునేలా మార్పులు చేసింది. ఈ ప్రయోగాత్మక విజయంతో, భవిష్యత్తులో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








