‘మొంథా’ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 40 లక్షల మందిపై పడుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ తుపాను పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 364 స్కూళ్లను సహాయ కేంద్రాలుగా మార్చామని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత స్థితిని తెలుసుకుంటూ, తుపాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారని లోకేశ్ తెలిపారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లోకేశ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. “దయచేసి అందరూ మీ ఇళ్లలోనే ఉండండి. బీచుల వంటి ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడతాం” అని ఆయన కోరారు. ముఖ్యంగా యువత ఈ సమయంలో బీచ్‌ల దగ్గరికి వెళ్లి వీడియోలు చేస్తామని అంటే కుదరదని, ఇది సరైన సమయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రిటికల్ అవర్స్‌లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, చాలా ప్రాంతాల్లో వర్షాలు గట్టిగా పడుతున్నాయని హెచ్చరించారు.
తుపాను సహాయక చర్యల గురించి వివరిస్తూ, ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నారని నారా లోకేశ్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని, దానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో తుపానులు వచ్చిన సమయంలో కూడా ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విపత్తు నిర్వహణలో చాలా అనుభవం ఉందని చెబుతూ, ప్రజలు కూడా సమయానుకూలంగా ప్రభుత్వం ఇచ్చే సలహాలను పాటించాలని కోరారు.








