AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖర్చుల తగ్గింపులో భాగంగా అమెజాన్‌లో భారీ లేఆఫ్‌లు: 30,000 మందికిపైగా ఉద్యోగుల తొలగింపు యోచన

 ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన కార్పొరేట్ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఏకంగా 30,000 మందికిపైగా కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అమెజాన్‌లో మొత్తం 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉండగా, తాజా తొలగింపులు ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదిగా మారే అవకాశం ఉంది. 2020 తరువాత సంస్థలో ఈ స్థాయిలో లేఆఫ్‌లు జరగడం ఇదే తొలిసారి కానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

అమెజాన్ సీఈవోగా యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. 2022 చివరి నుంచి దాదాపు 27,000 మంది ఉద్యోగులను ఇప్పటికే అమెజాన్ తొలగించింది. తాజాగా సంస్థ తీసుకున్న ఈ లేఆఫ్స్ నిర్ణయం వల్ల కంపెనీలోని మానవ వనరులు, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసులు సేవల విభాగాలతో సహా మరికొన్ని విభాగాలు ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మానవ వనరుల విభాగంలో ఈసారి 15 శాతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

అమెజాన్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించేందుకు ముఖ్యంగా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో అమెజాన్ సీఈవో జెస్సీ ఉద్యోగులకు రాసిన ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుండి వచ్చే సామర్థ్య లాభాలు చివరికి కంపెనీని తక్కువ మానవ వనరులతో పనిచేయడానికి అనుమతిస్తాయని పేర్కొన్నారు. ఇది కంపెనీ భవిష్యత్తు కార్యాచరణలో మానవ వనరుల వినియోగంపై స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

ANN TOP 10