రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించడంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని గూగుల్ భావించినప్పటికీ, తర్వాత ఏపీకి మళ్లింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్, ఏపీ ప్రభుత్వం 15 ఏళ్లు ఉచిత విద్యుత్, తక్కువ ధరకే నీరు, 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ వంటి భారీ ప్రలోభాలతో గూగుల్‌ను లాగేసిందని ఆరోపించింది. ఇది పెట్టుబడిని ఆకర్షించే మెరిట్ కాదని, కేవలం లాక్కోవడానికి చేసిన కుతంత్రమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భారీ రాయితీల జాబితా
కర్ణాటక కాంగ్రెస్ తమ పోస్ట్‌లో, గూగుల్‌కు ఏపీ ప్రభుత్వం అందించిన ఆఫర్లను జాబితా చేసింది. అందులో ముఖ్యంగా: 15 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, 10 సంవత్సరాల పాటు నీటిని 25 శాతం ధరకే అందించడం, 480 ఎకరాల భూమిని అతి తక్కువ ధరలకు కేటాయించడం, మరియు రూ.2,245 కోట్ల విలువైన 100 శాతం ఎస్జీఎస్టీ చెల్లింపును తిరిగి ఇవ్వడం వంటివి ఉన్నాయని తెలిపింది. తాము పెట్టుబడుల కోసం ఎవరినీ యాచించమని, బ్రతిమాలమని, బదులుగా తమ రాష్ట్రం భారతదేశంలో ఎఫ్డీఐలో మొదటి స్థానంలో ఉంది కాబట్టే సహజంగానే పెట్టుబడిదారులను ఆకర్షిస్తామని కర్ణాటక కాంగ్రెస్ వివరించింది.
టీడీపీ స్ట్రాంగ్ రిప్లై
కర్ణాటక కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతి.. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఇష్టమైన చర్చా అంశంగా మారినట్లుంది. మా అభివృద్ధి వేడి వారికి కొంచెం మంటలా మారుతున్నట్లు కనిపిస్తోందని” టీడీపీ వ్యంగ్యంగా స్పందించింది. ఈ రిప్లైపై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది, కొందరు టీడీపీకి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు కర్ణాటక కాంగ్రెస్ వాదనను సమర్థిస్తున్నారు.








