AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజస్థాన్‌లో మరో బస్సు దగ్ధం: విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు మృతి

కర్నూలులో జరిగిన ఘటనను మరువకముందే, మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడం వల్లే ప్రమాదం

జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు బస్సు చేరుకోగానే, దానికి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

పలువురి పరిస్థితి విషమం

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ANN TOP 10