AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికాలో తెలుగు యువత సత్తా: రూ.2.25 కోట్ల వార్షిక ప్యాకేజీతో గూగుల్‌లో సాత్విక్ రెడ్డికి ఉద్యోగం!

అమెరికాతో పాటు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థల్లో భారతీయులు తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తెలుగు యువకుడు సాత్విక్ రెడ్డి, ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం సాధించి, మునుపటి బీహార్ యువకుడి రికార్డును బద్దలు కొట్టాడు. అమెరికాలోని న్యూయార్క్, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వెంటనే సాత్విక్ రెడ్డి ఈ డ్రీమ్ జాబ్‌ను అందుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే ఐఐటీల నుంచే రావాలనే నియమాన్ని పక్కనపెట్టి, తన టాలెంట్‌తో ఈ భారీ ప్యాకేజీని దక్కించుకుని తెలుగు యువత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.

సాత్విక్ రెడ్డికి లభించిన ఈ ప్యాకేజీ రోజుకు దాదాపు రూ.60 వేలకు పైనే అవుతుంది. ఈ డ్రీమ్ జాబ్‌తో సాత్విక్ ఇప్పుడు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో కొలువు చేయబోతున్నాడు. కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కుమారుడైన సాత్విక్ సాధించిన ఈ ఘనత గురించి తెలియగానే, పట్టణంలోని ప్రముఖులు, అతని మిత్రులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

కాగా, ఈ ఏడాది మే నెలలో విజయవాడకు చెందిన మరో విద్యార్థి ఆరేపల్లి వెంకటసాయి ఆదిత్యకు కూడా అమెజాన్ కంపెనీలో రూ.కోటి యాభై లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో భారతీయ విద్యార్థులకు కష్టకాలం నడుస్తోంది, ట్రంప్ విధానాలతో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో, వరుసగా భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు యువత, ఇటువంటి భారీ ఆఫర్లను అందుకోవడం కొంత ఊరట కలిగించే అంశం.

ANN TOP 10