AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా, 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు (బీఎల్‌ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తారు. నకిలీ ఓట్లను తొలగించడం మరియు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడం ఈ ఎస్‌ఐఆర్‌ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ప్రకటించిన రెండో దశ ఎస్‌ఐఆర్‌ జాబితాలో తెలుగు రాష్ట్రాలు లేవు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా, బీఎల్‌ఓలు జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకి యూనిక్ ఎన్యుమరేషన్ ఫాం ఇస్తారు, వాటిలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు ఉంటాయి. ఓటరు తన పేరు, వివరాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారి పేర్లు ఓటరు జాబితాలో లేకపోయినా, వారి తల్లిదండ్రుల పేర్లు 2003 ఓటరు జాబితాలో ఉంటే, వారు అదనపు పత్రాలు సమర్పించనవసరం లేదు. 2002 నుంచి 2004 వరకు ఉన్న ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా http://voters.eci.gov.in లో అందుబాటులో ఉంటుందని, ఎవరైనా స్వయంగా పరిశీలించుకోవచ్చని జ్ఞానేశ్ కుమార్ వివరించారు.

ఓటరు జాబితా సవరణ కోసం రాష్ట్రాల లిస్టును ఈసీ ఇవాళ రాత్రి 12 గంటలకు ఫ్రీజ్ చేయనుంది. బిహార్‌లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తవ్వగా, వచ్చే ఏడాది అసోం, కేరళతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నారు. జాబితా ప్రకటించాక, తమ వివరాలు సరిగా లేని వారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని సీఈసీ స్పష్టం చేశారు.

ANN TOP 10