AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌తో టెస్టు సమరం: గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ బవుమా రీఎంట్రీ!

గాయం నుంచి కోలుకున్న బ్యాట్స్‌మెన్ టెంబా బవుమాను కెప్టెన్‌గా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా, భారత్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌కు పిక్క కండరాల గాయం కారణంగా దూరమైన బవుమా, ఇప్పుడు కెప్టెన్‌గా జట్టులోకి తిరిగి వచ్చాడు. బవుమా స్థానంలో పాకిస్థాన్‌తో సిరీస్‌లో జట్టులో ఉన్న డేవిడ్ బెడింగ్‌హామ్‌ను ఈసారి పక్కన పెట్టారు. భారత్‌లో స్పిన్‌ కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాతో సఫారీ జట్టు కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్, సెనురన్ ముత్తుస్వామి వంటి ముగ్గురు స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చింది.

ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 14న కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 22న గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో జరగనుంది. గౌహతి మైదానంలో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు, నవంబర్ 2 నుంచి బెంగళూరు వేదికగా జరిగే భారత్ ‘ఏ’ జట్టుతో సిరీస్‌లో కూడా బవుమా ఆడనున్నాడు. ఈ ‘ఏ’ సిరీస్‌లోనే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా పాదం గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టు ఎంపికపై హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి సిరీస్‌ను డ్రాగా ముగించిన ఆటగాళ్లనే ఎక్కువగా కొనసాగించామని తెలిపారు. భారత్‌లో కూడా కఠిన సవాలు ఎదురవుతుందని భావిస్తున్నామని, జట్టు సమష్టి కృషితోనే విజయం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఈ పర్యటనకు ఎంపికైన జట్టులో పేస్ విభాగానికి కగిసో రబాడతో పాటు ఆల్‌రౌండర్లు కార్బిన్ బాష్, మార్కో యన్సెన్, వియాన్ ముల్డర్ ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు వివరాలు: టెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబాడ, సైమన్ హార్మర్.

ANN TOP 10