కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషాదంపై సినీ ప్రముఖులు రష్మిక మందన, కిరణ్ అబ్బవరం, సోనూ సూద్ విచారం వ్యక్తం చేశారు. రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ ప్రమాద వార్త తన హృదయాన్ని తీవ్రంగా బాధపెడుతోందని పేర్కొన్నారు. కాలిపోతున్న బస్సులో ఆ ప్రయాణికులు ఎలాంటి బాధను అనుభవించారనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని, చిన్న పిల్లలతో సహా మొత్తం కుటుంబం నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు.
మరోవైపు, నటుడు కిరణ్ అబ్బవరం కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన హృదయం బరువెక్కిందని, వారికి బలాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నటుడు సోనూ సూద్ ఈ ప్రమాదాలను ప్రస్తావిస్తూ, గత 2 వారాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ కుటుంబాలను చూడటానికి ప్రయాణిస్తున్నారు… చనిపోవడానికి కాదు అని వ్యాఖ్యానించిన సోనూ సూద్, సురక్షితమైన వైరింగ్ మరియు అత్యవసర ఎగ్జిట్స్ వంటి కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయడానికి ఇది సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి, అగ్నిప్రమాదానికి గురైన బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న 400 మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్ ప్రాథమికంగా గుర్తించింది. బైక్‌ను ఢీకొట్టడం వల్ల చెలరేగిన మంటలు లగేజీ క్యాబిన్‌కు వ్యాపించి, మొబైల్ ఫోన్లు పేలడంతో మంటలు క్షణాల్లోనే ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని, దీంతో ముందు భాగంలోని ప్రయాణికులు తప్పించుకునే సమయం లేకుండా పోయిందని ఫోరెన్సిక్ నివేదిక సూచిస్తోంది.









