తెలంగాణలో కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. తుపాకీతో బెదిరింపులు, అవినీతి వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ ఎన్. సుమంత్‌లపై తక్షణం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ గతంలో మీడియా ముందు చేసిన సంచలన ఆరోపణల ఆధారంగా బీఆర్‌ఎస్ ఈ ఫిర్యాదు చేసింది.
సుష్మిత పటేల్ చేసిన ఆరోపణల ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి, సుమంత్‌తో కలిసి డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారని, ఈ సందర్భంగా తుపాకీతో బెదిరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రే రోహిణ్ రెడ్డికి తుపాకీ ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం సంఘటన తన తండ్రి కొండా మురళిని అరెస్టు చేయడానికి, తల్లి మంత్రి పదవిని తీసేయడానికి చేసిన కుట్రగా ఆమె అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి, సలహాదారు వెం. నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ కుటుంబాన్ని అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ సంఘటన అక్టోబర్ 15న జరిగింది. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలతో అప్పటికే పదవి నుంచి తప్పించిన మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను అరెస్టు చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. అయితే, సురేఖ, ఆమె కుమార్తె ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని, సుమంత్‌ను వేరే వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇంకా కేసు నమోదుపై తుది నిర్ణయం తీసుకోలేదు.








