డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇటీవల హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వైట్‌హౌస్ సమర్థించుకుంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, “హెచ్-1బీ వీసా వ్యవస్థ చాలాకాలం నుంచీ మోసాలతో నిండిపోయింది” అని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యవస్థ స్థానిక అమెరికన్ ఉద్యోగుల వేతనాలను తగ్గించిందని, అందుకే అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవస్థను బలోపేతం చేసి, అమెరికా కార్మికులకు అవకాశాలను కల్పించడానికి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారని ఆమె స్పష్టం చేశారు.
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వైట్‌హౌస్ ఈ ప్రకటన చేసింది. ఫీజు పెంపును సవాలు చేస్తూ కోర్టులో పోరాడేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధంగా ఉందని లీవిట్ ఉద్ఘాటించారు. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ తీసుకొచ్చిన వీసా వ్యవస్థను దెబ్బతీస్తాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను కోల్పోవాల్సి వస్తుందని అమెరికన్ కంపెనీలు కూడా ఈ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నాయి.
హెచ్-1బీ వీసాదారులలో భారతీయులే అధికంగా ఉన్నారు. అమెరికా జారీ చేసిన ఈ వీసాల్లో దాదాపు 71 శాతం భారతీయులకే దక్కినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీజు పెంపు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, అమెరికాలో ఎఫ్-1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు ఉన్నత చదువుల తర్వాత హెచ్-1బీకి మారితే వారికి ఫీజు ఉండదని ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది.








