కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేసిన బస్సు డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు నేరుగా బైక్‌ను ఢీకొట్టలేదు. బస్సు అక్కడికి చేరుకోకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి, బైక్ రోడ్డుపై పడి ఉంది. భారీ వర్షం కారణంగా సరిగా చూడలేక, బస్సు ఆ పడి ఉన్న బైక్‌పైకి ఎక్కి ఈడ్చుకెళ్లింది అని డ్రైవర్లు పోలీసులకు తెలిపారు.
బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లడం వల్ల బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ అయి, స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయని డ్రైవర్లు వెల్లడించారు. అంతకుముందే బైక్ ప్రమాదం జరగడంతో బైక్ నడిపిన శివకుమార్ రోడ్డు పక్కన పడిపోయి, తర్వాత మరణించారు. బైక్ రైడర్ కూడా మరణించడంతో పోలీసులు అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది సజీవ దహనం కాగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు.
ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. బస్సులో ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కోసం డీఎన్‌ఏలు సేకరించారు. ఈ ఘోర దుర్ఘటన కారణంగా స్లీపర్ బస్సుల డిజైన్, ఫిట్‌నెస్, అగ్నిప్రమాదాల వేగం, ఎస్కేప్ ప్లాన్ వంటి భద్రతా అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కాగా, ప్రమాదానికి గురైన బస్సును లాగుతుండగా క్రేన్ కింద పడి ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.








