బిహార్‌లో ఇటీవల రాజకీయ దుమారం రేపిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియను ఇప్పుడు తమిళనాడులోనూ చేపట్టడానికి ఎన్నికల సంఘం (EC) సిద్ధమవుతోంది. నకిలీ ఓట్లను తొలగించే లక్ష్యంతో చేపట్టే ఈ ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు శుక్రవారం వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఓటు చోరీ’ జరుగుతోందని, ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లిన నేపథ్యంలో, ఇప్పుడు తమిళనాడులో ఈ ప్రక్రియ చేపట్టడంపై రాజకీయ విశ్లేషకులు ఇంకెంత రచ్చ జరుగుతుందోనని అభిప్రాయపడుతున్నారు.
చెన్నైలోని టి నగర్‌లో ఉన్న 229 పోలింగ్ బూత్‌లలో రీ-వెరిఫికేషన్ చేయాలని కోరుతూ ఏఐడీఎంకే మాజీ ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈసీ ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. ఎమ్మెల్యే ఆందోళనలకు ఎస్ఐఆర్ ప్రక్రియ పరిష్కారం చూపిస్తుందని ఈసీ న్యాయవాది పేర్కొన్నారు. కాగా, డీఎంకే మంత్రి దురై మురుగన్ గతంలోనే ఎస్ఐఆర్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తమిళనాడులో ఈసీ ఉపాయాలు చెల్లవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.








