మలయాళంలో ‘లోకా చాప్టర్ 1- చంద్ర’ టైటిల్‌తో విడుదలై, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ప్రేక్షకులను అలరించిన సూపర్ హీరో చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, ఆగస్టు 28న విడుదలైన తర్వాత కేవలం 40 రోజుల్లోనే ఏకంగా రూ. 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీ సత్తాను మరోసారి చాటింది.
ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన సూపర్ హీరో పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. వీఎఫ్‌ఎక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొనగా, తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 31వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘కొత్త లోక’ కథ విషయానికి వస్తే, నాయిక పాత్ర పేరు చంద్ర, ఆమె బెంగళూరుకు కొత్తగా వస్తుంది. ఆమె నివసించే ఇంటి ఎదురుగా ఉండే సన్నీ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో, చంద్రకు సూపర్ పవర్స్ ఉన్నాయనే విషయం సన్నీకి తెలుస్తుంది. చంద్రకు ఆ శక్తులు ఎలా వచ్చాయి, ఆమె గతం ఏమిటి అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా మలయాళంలో సాధించిన ఘన విజయం తెలుగు ప్రేక్షకులలో కూడా అంచనాలు పెంచింది.








