AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం: స్పిన్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియామకం

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంచైజీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించింది. గతంలో 2023 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సునీల్ జోషి స్థానంలో బహుతులే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ సంతోషం వ్యక్తం చేశారు.

51 ఏళ్ల సాయిరాజ్ బహుతులేకు కోచింగ్ రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఐపీఎల్ 2025 సీజన్ వరకు పనిచేశారు. ఇటీవలే ఆర్ఆర్ ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించగా, వెంటనే పంజాబ్ కింగ్స్ ఆయన్ను తమ కోచింగ్ బృందంలోకి తీసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు, ఆయన గ‌తంలో బెంగాల్‌, కేర‌ళ‌, విద‌ర్భ‌, గుజ‌రాత్ వంటి దేశీయ జ‌ట్ల‌తో క‌లిసి కూడా ప‌నిచేశారు. అన్ని ఫార్మాట్ల‌లో భార‌త యువ బౌల‌ర్ల‌ను మెరిక‌లుగా తీర్చిదిద్ద‌డంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

పంజాబ్ కింగ్స్ కోచింగ్ బృందంలో చేరడం పట్ల సాయిరాజ్ బహుతులే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “పంజాబ్ కింగ్స్ జట్టులో వేరే బ్రాండ్ క్రికెట్ ఆడుతారు, సామ‌ర్థ్యం చాలా ఎక్కువ. జ‌ట్టులో చాలా మంది ప్ర‌తిభావంతులైన ఆట‌గాళ్లు ఉన్నారు. వారి నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి, వారు కొత్త శిఖ‌రాల‌ను చేరుకోవ‌డానికి సాయప‌డ‌టానికి, వారితో క‌లిసి ప‌నిచేయ‌డం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అని సాయిరాజ్ బహుతులే అన్నారు. పంజాబ్ కింగ్స్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా కొనసాగుతుండగా, బ్రాడ్ హాడిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు.

ANN TOP 10