తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇప్పటివరకు అడ్డుగా ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను తొలగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉన్నారు. ఈ నిబంధనను తొలగించడానికి అవసరమైన చట్ట సవరణ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు.
ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా గురువారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించనుంది. ఆ తర్వాత, ఈ సవరణను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే, ఇది ఆర్డినెన్స్ రూపంలో అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నిబంధన తొలగింపు ద్వారా, ఇకపై తెలంగాణలో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుంది.
రాష్ట్రంలోని అనేక మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ నిబంధన కారణంగా పోటీకి దూరమవుతున్నారని, ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేస్తున్నదని గతంలో వాదనలు వినిపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల కొరత ఏర్పడటంతో, ఈ నిబంధనను సవరించాలన్న డిమాండ్ బలపడింది. గ్రామీణ ప్రజల్లో రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం, సమాజంలోని ప్రతి వర్గానికి ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాలు కల్పించడమే ఈ సవరణ వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆస్పిరెంట్ లకు పెద్ద ఉపశమనం కలిగించే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.









