మద్యం మత్తులో ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
విమానాల్లో మందుబాబుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఫుల్లుగా తాగి విమానం ఎక్కి తోటి ప్రయాణికులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో విమానాల్లో జరుగుతోన్న ఈ ఘటనలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. తాజాగా, మద్యం మత్తులో (Drunk Passenger) విమానం ఎక్కిన ఓ ప్రబుద్ధుడు.. ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీయడానికి ప్రయత్నించాడు. సకాలంలో సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
విమానం గమ్యానికి చేరిన తర్వాత నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ- బెంగళూరు ఇండిగో విమానంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ308 విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి బెంగళూరు (Delhi-Bengaluru)కు బయలుదేరింది. ఉదయం 7.56 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎగిరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్లాప్ తెరిచే ప్రయత్నం చేశాడు.
దీనిని గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకుని అతడ్ని సీటులో కూర్చోబెట్టారు. అనంతరం కాక్‌పీట్‌లో ఉన్న కెప్టెన్‌కు సమాచారం ఇచ్చారు. విమానం బెంగళూరుకు చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గురించి ఓ ప్రకటన విడుదల చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. భదత్ర విషయంలో ఎటువంటి రాజీలేదని పేర్కొంది.