AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న సొంత పార్టీ నేతలు: దీని వెనుక ‘అదృశ్య శక్తి’ ఉందా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మొదట్లో నేతలంతా ఒక్కతాటిపై ఉన్నట్టు కనిపించినా, కొద్ది రోజులుగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి కీలక నేతలు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవులు రాకపోవడం, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అసంతృప్తి వంటి కారణాలతో పాటు, ఈ నేతల వెనుక ఏదైనా ‘అదృశ్య శక్తి’ ఉండి ఈ కథ నడిపిస్తుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొందరు బీఆర్ఎస్ నేతలు వెనకుండి నడిపిస్తున్నారనే టాక్ కూడా గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ అసమ్మతి నేతల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ‘డైలీ సీరియల్‌ను’ తలపిస్తోంది. ఆమె తన కేబినెట్ మంత్రులను టార్గెట్ చేయడం, రెడ్డి లీడర్లంతా బీసీలను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు చేయడం వంటివి పార్టీలో కుల రాజకీయాలకు తెరలేపాయి. అంతేకాక, మేడారం ఆలయ టెండర్లలో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం, ఆమె ఓఎస్డీ తొలగింపు విషయంలో ప్రభుత్వంపై సవాల్ విసరడం వంటివి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారాయి. మరోవైపు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంతే అడ్డుకుంటున్నారని బహిరంగంగా విమర్శిస్తున్నారు. అంతేకాక, ఎక్సైజ్ టెండర్ల విషయంలో మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేక నియమాలు విధించేందుకు ప్రయత్నించడం వంటివి ఆయన, సీఎం మధ్య విభేదాలను మరింత పెంచాయి.

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సొంత పార్టీ విధానాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా మంత్రుల జిల్లాలు, వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయంటూ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు గుప్పించడం పార్టీకి మరో తలనొప్పిగా మారింది. ఈ నేతలందరిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. హైకమాండ్ చర్యలు తీసుకోకపోతే, ఈ అసంతృప్తి ప్రభుత్వానికి, పార్టీకి మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ANN TOP 10