ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛన్లకు సంబంధించిన డీఏ (కరువు భత్యం) పెంపును అమలులోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి 3.64 శాతం డీఏను అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో నుంచి ఒక డీఏను వచ్చే నెల (నవంబరు) జీతాలతో పాటు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పెంచిన డీఏతో పాటు, బకాయిలు కూడా త్వరలోనే విడుదల కానుండటంతో ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా, వాటిలో నుంచి ఒక డీఏను నవంబరు 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ఒక్క డీఏ విడుదలతో ప్రభుత్వంపై సుమారు ₹160 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల దీపావళి పండుగ ఆనందాన్ని మరింత పెంచినట్లయింది.