తమిళనాడు రాష్ట్రంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ఇప్పటివరకు 89 మంది గాయపడ్డారని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. సోమవారం ఆయన కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కాలిన గాయాల (బర్న్) వార్డును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ 89 మంది గాయపడిన వారిలో 41 మందికి చికిత్స పూర్తయి వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారని, మరో 48 మందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
గాయపడిన వారిలో 32 మందికి ప్రధాన శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. దీపావళి సందర్భంగా కాలిన గాయాల చికిత్స కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో కాలిన గాయాల కోసం 20 పడకలు అదనంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి బాణాసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. దీపావళి వేడుకలు జరుపుకునే క్రమంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు పర్యవేక్షణ తప్పనిసరి అని ఆయన సూచించారు.