AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీఎస్టీ సంస్కరణలతో దేశంలో పెరిగిన కొనుగోళ్లు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST Reforms) వల్ల దేశంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా వచ్చిన పన్ను తగ్గింపు ప్రయోజనాలను సామాన్యులకు అందించామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, జీఎస్టీ రేట్ల కోతలతో కలిగే ప్రయోజనం వినియోగదారులకు చేరినట్లు తెలిపారు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గించడం వల్లే వినియోగదారులు ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని వెల్లడించారు.

జీఎస్టీ 2.0 అమలు తర్వాత వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు పెరిగాయని నిర్మలా సీతారామన్ గణాంకాలతో వివరించారు. ముఖ్యంగా త్రీ వీలర్ వాహనాల డిస్పాచ్‌లు 5.5 శాతం పెరిగాయని, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21.6 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 22న జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమైన మొదటి రోజే ఏసీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, టీవీల అమ్మకాలు కూడా 30-35 శాతం పెరిగాయని ఆమె వివరించారు.

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 ను అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. నవరాత్రి సందర్భంగా వాహనాల అమ్మకాలు పెరిగాయని, మారుతి సుజుకి మొదటి ఎనిమిది రోజుల్లోనే 1.65 లక్షల కార్లను విక్రయించిందని పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి వేగం బలంగా ఉందని, ఐఎంఎఫ్ కూడా వృద్ధి అంచనాను 6.6 శాతానికి సవరించిందని తెలిపారు. ఈ ఏడాది అదనంగా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఉంటుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అంచనా వేశారు.

ANN TOP 10