రేర్ ఎర్త్ లోహాలు (Rare Earth Metals) మరియు శాశ్వత అయస్కాంతాల (Permanent Magnets) సరఫరాపై చైనా నియంత్రణ పెంచుతున్న నేపథ్యంలో, భారతదేశం ఈ లోహాల కోసం చైనాపై అధికంగా (సుమారు 65 శాతం) ఆధారపడుతోంది. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయంగా, కేంద్ర ప్రభుత్వం స్వావలంబన (Self-reliance) వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం భారతీయ కంపెనీలు రష్యాలో (India- Russia) అవకాశాలను అన్వేషించడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ప్రాథమిక దశ చర్చలు జరుగుతున్నాయి.
భారత్ తరపున లోహమ్ (Lohum) మరియు మిడ్‌వెస్ట్ (Midwest) కంపెనీలను రష్యాతో చర్చలు జరపడానికి ఎంపిక చేశారు. ఈ కంపెనీలు రష్యాలోని ఖనిజ సంబంధిత కంపెనీలతో కలిసి భారతదేశం కోసం కొత్త అవకాశాలను అన్వేషిస్తాయి. రష్యా తరపున ప్రభుత్వ రంగ సంస్థలైన నోర్నికెల్ (Nornickel) మరియు రోసాటమ్ (Rosatom) ఈ భాగస్వామ్యంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్‌లో రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌పై చైనా దాదాపు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా రష్యా రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ సాంకేతికతలపై చాలా కృషి చేసింది. భారతదేశంతో కలిసి ఈ సాంకేతికతలను వాణిజ్య రూపం ఇవ్వాలని రష్యా యోచిస్తోంది. ఈ భాగస్వామ్యం సాధ్యమైతే, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ ప్రపంచంలో భారత్-రష్యా రెండు కొత్త పేర్లుగా మారుతాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, భారతదేశానికి ఎగుమతులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇటీవల, రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (REPM) ఉత్పత్తి కోసం రూ. 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించడం గురించి కూడా భారత ప్రభుత్వం చర్చించింది.