బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ (Telangana BC JAC) పిలుపునిచ్చిన బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. శనివారం (అక్టోబర్ 18న) ఖైరతాబాద్ చౌరస్తాలో భారీ మానవహారం నిర్మించి ఆమె ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్‌కు మద్దతు పలకడం నవ్వులాటలా ఉందని, ఇది “హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు” ఉందని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కావాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ల బిల్లు నడుచుకుంటూ వస్తుందని, త్యాగాల ద్వారానే తొలి అడుగు పడుతుందని ఆమె అన్నారు. బీజేపీ ఎంపీలు తమ పదవులను త్యాగం చేయాలని, లేకపోతే వారి ఇళ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ కూడా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. జీవో 9 విషయంలో సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే కోర్టు కొట్టివేసిందని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని కవిత అన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులలో రిజర్వేషన్లు వచ్చాకే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేస్తూ, బిల్లులు చేయాల్సిన పార్టీలు బంద్‌లో పాల్గొనడం సరికాదని ప్రశ్నించారు. ఈ ఆందోళనలో కవిత తనయుడు ఆదిత్య కూడా పాల్గొని బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువతే భవిష్యత్తు అని, బీసీల కోసం తన తల్లి చేస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతునివ్వాలని కోరారు.