ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్‌మెంట్ అధిపతులకు (HoDs) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి తన నివాసంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు మరియు సీఎం ఆఫీస్ సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, కొందరు అధికారుల పనితీరులో మార్పు రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే ప్రభుత్వం సహించబోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలకు పాల్పడకూడదని సీఎం ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అధికారులు సోమరితనాన్ని వదిలేసి, పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేర్చడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ అధికారులు ప్రతి వారం తమ డిపార్ట్‌మెంట్ల నివేదికలను సమర్పించాలని, వాటిని సీఎం స్వయంగా సమీక్షిస్తారని ఆదేశించారు.
అంతేకాక, కేంద్ర నిధుల స్థితిని సమీక్షిస్తూ, అన్ని విభాగాల సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకొని, పెండింగ్‌లో ఉన్న కేంద్ర గ్రాంట్లు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులను విడుదల చేయించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వాటా ఇప్పటికే చెల్లించిన పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్ర నిధుల విడుదలను వేగవంతం చేయాలని సూచించారు. ఏ ఫైల్ లేదా ప్రాజెక్ట్ పెండింగ్‌గా ఉండకూడదని, అన్ని పనులు జాప్యం లేకుండా పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు.