తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు తమ చిరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ముఖ్యంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ (Regularization), వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడం, అలాగే ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందులోని ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. దశాబ్ద కాలంగా పరిష్కారం కాని తమ డిమాండ్లపై మంత్రి దృష్టిని ఆకర్షించారు.
పంచాయతీ కార్యదర్శులు అదనంగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన 98 మంది అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవడం, గతంలో బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన 16 రోజుల సమ్మె కాలాన్ని సర్వీస్‌గా పరిగణించడం, వైద్య బిల్లుల క్లియరెన్స్ వంటి కీలక అంశాలను కూడా మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ప్రస్తావించారు. గతంలో తమకు రూ. 104 కోట్ల బిల్లులు విడుదల చేయించడం, డిప్యూటేషన్లకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు వారు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు చేసిన వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. న్యాయమైన పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె హామీ ఇచ్చారు. ఈ అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనను మంత్రి ఆదేశించారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకం గా సమావేశాన్ని నిర్వహించి, అన్ని అంశాలపై ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని సీతక్క తెలిపారు. మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో కార్యదర్శులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.