AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ ప్రకటనను ఖండించిన భారత్: మోదీ హామీ ఇవ్వలేదన్న విదేశాంగ శాఖ

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. బుధవారం వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను మోదీతో ఫోన్‌లో మాట్లాడానని, రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తానని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరి చేసే ప్రయత్నాల్లో ఇదో కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ అంశంపై భారత్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, చమురు విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. వీటి ఆధారంగానే తమ దిగుమతి విధానాలు ఉంటాయని వివరించింది. తమ ఇంధన భద్రత మరియు సరఫరా విషయంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని భారత్ పరోక్షంగా తెలియజేసింది.

అమెరికాతో సంబంధాలపై మాట్లాడుతూ.. చమురు దిగుమతిని పెంచడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, గత దశాబ్ద కాలంలో చాలా పురోగతి కనిపించిందని భారత్ పేర్కొంది. భారత్ ప్రకటనతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమా, కాదా అనే గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ చమురు కొనుగోలు విధానంపై భారత్ తన స్వతంత్ర వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు అయింది.

ANN TOP 10