భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, అక్టోబర్ 16 (గురువారం) నాటితో నైరుతి రుతుపవనాలకు ఎండ్ కార్డ్ పడిపోయింది. దేశం నుంచి ఈ రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు IMD ప్రకటించింది. దీంతో అధికారికంగా వర్షాకాలం ముగిసినప్పటికీ, వర్షాలు మాత్రం తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో విడిచిపెట్టేలా లేవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడంతో, దేశంలోకి ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. మరికొన్ని రోజుల్లో ఇవి దేశం మొత్తంలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో చలిగాలులు పెరగడంతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరికలు జారీ చేసింది.
అంటే, ఇంతకాలం సాధారణ వర్షాలు కురిస్తే, ఇప్పుడు చల్లని గాలులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ రుతుపవనాల మార్పు కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మరికొన్ని రోజులు వర్షాల తీవ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది.